12 నుంచి తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్…
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 12 మార్చి, 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాలపాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్ధిక శాఖ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ పంచాయతీ రాజ్, సభ్యకార్యదర్శిగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ లు ఉంటారని సీఎం తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేయాలని ముఖ్యమంత్రి సీఎస్‌ను ఆదేశించారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను విధి విధానాలను లక్ష్యాలను ప్రధాని వివరించారు. ప్రధానితో వీడియో కాన్పరెన్స్ అనంతరం.. కార్యక్రమ నిర్వహణ విధి విధానాలకోసం, సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా మార్చి 12న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో, వరంగల్ పోలీసు గ్రౌండ్స్ లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్..వరంగల్ లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొంటారు.
75వ స్వాతంత్య్రోత్సవ ఉత్సవాలకు గుర్తుగా, సంజీవయ్య పార్క్ లో ఉన్న జాతీయ పతాకం తరహాలో, తెలంగాణవ్యాప్తంగా 75 ముఖ్యమైన ప్రాంతాల్లో ఘనమైన రీతిలో జాతీయ జెండాలను ఎగురవేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తద్వారా తెలంగాణ వ్యాప్తంగా జాతీయ భావాలను మరింతగా పెంపొందించాలని పేర్కొన్నారు. 75వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో వ్యాస రచన పోటీలు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు, చిత్రలేఖన పోటీలు, వంటి దేశభక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.













