హైదరాబాద్లో ఎన్నారై భవనం
హైదరాబాద్ నగరంలో ఎన్నారై భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడతానని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన స్థలం ప్రభుత్వం కేటాయించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఆస్ట్రేలియలో ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఆయనను ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఎన్నారై సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎన్నారై భవనం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఎకరం స్థలం కేటాయిస్తే ప్రపంచంలో ఉన్న ఎన్నారైలంతా కలిసి భవనం నిర్మించుకుంటారని వారు వివరించారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, మహ్మద్ అజయ్ అలీ తదితరులు హాజరయ్యారు.













