హైదరాబాద్లో ఆటా జాబ్ మేళా సక్సెస్
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలో జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమక్షంలో జరిగిన ఈ జాబ్ మేళాకు పలువురు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రులకు, ఎంతో కష్టపడి మీరు చదివిన చదువుకు తగిన జాబ్ లభించినప్పుడే విద్యార్థులకు, తల్లిదండ్రులకు గౌరవం, తృప్తి కలుగుతుందని పేర్కొన్నారు. విద్యార్ధుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే జాబ్ మేళా ఒక గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా కళాశాలల్లోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్న అమెరికా తెలుగు అసోసియేషన్ సభ్యులను మంత్రి ప్రశంసించారు.
ఈ సందర్భంగా జాబ్ మేళాకు వచ్చిన వివిధ సంస్థల ప్రతినిధులకు మంత్రి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మినేని మధు, లోహిత్ కుమార్, అపోలో హాస్పిటల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సురేందర్ రెడ్డి, మెథడిస్ట్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభు, వివిధ సంస్థల ప్రతినిధులు సూర్య చంద్రారెడ్డి, రాకేశ్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.













