పోలీసులంటేనే హడల్… లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్న తెలంగాణ

లాక్‌డౌన్ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా ఉగ్రరూపం చూపిస్తున్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ ప్రకటించిన మూడు నాలుగు రోజులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. డీజీపీ సమీక్ష తర్వాత కాస్త కఠినంగా మారారు. తాజాగా సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపు సమయం పూర్తైన తర్వాత అనవసరంగా ఎవరైనా రోడ్లపై తిరిగితే వారి వాహనాలను ఏకంగా సీజ్ చేస్తున్నారు. అవసరం ఉన్న వారు, అత్యవసర సర్వీసుకు సంబంధించిన వారిని మాత్రం విడిచిపెడుతున్నారు. అయితే వారి ఐడీ కార్డును చూసిన తర్వాతే పోలీసులు వారిని విడిచిపెడుతున్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీజీపీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు శనివారం నుంచి తెలంగాణలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా గల్లీలు, బస్తీల్లో లాక్‌డౌన్ పర్యవేక్షణ కోసం డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. వీటి ద్వారా నిరంతర నిఘాను కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత అకారణంగా రోడ్లపైకి వచ్చేవారిపై విపత్తు నిర్వహణ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.
అయితే కొందరు పాత పాసులతో రోడ్డుపైకి వచ్చి దర్జాగా తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాంటి వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ‘ప్రెస్’ అని అతికించుకొని, ఆ రంగానికి సంబంధం లేని వారిని కూడా గుర్తించి, వాహనాలను సీజ్ చేస్తున్నారు. అయితే ఎక్కువ ఆరోగ్య కారణాల రీత్యానే బయటికి వస్తున్నారని పోలీసులు అంటున్నారు. నిజమైన కారణం ఉంటే, తామేమీ ఆపడం లేదని, నకిలీ కారణముంటే మాత్రం వాహనాలను సీజ్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరో వైపు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా లాక్‌డౌన్‌పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ సరైన రీతిలో అమలు కావడం లేదని, జిల్లాల ఎస్పీలు, సీపీలు, ఐజీలు స్వయంగా క్షేత్ర స్థాయిల్లోకి వెళ్లి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించాలని సూచించారు. అంతేకాకుండా గల్లీలు, బస్తీల్లో కూడా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. దీంతో పోలీసులు గల్లీలు, బస్తీల్లో కూడా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారు. కారణంగా లేకుండా బయటికి వస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపిస్తున్నారు. అకారణంగా బయటికి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఏకంగా డీజీపీ మహేందర్ రెడ్డి రోడ్డుపైకి…
సీఎం కేసీఆర్ సూచించడంతో డీజీపీ మహేందర్ రెడ్డి సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటనలు నిర్వహించారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను తనిఖీ చేశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఎవరూ బేఖాతర్ చేయవద్దని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు నిత్యావసరాలను కొనుగోలు చేసి, ఇంటికే పరిమితం కావాలని తేల్చి చెప్పారు. కారణం లేకుండా ఎవరూ రోడ్లపైకి తిరగవద్దని కోరారు.