వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
కరోనా ఆపత్కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వాలకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. కొవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చాలాచోట్ల టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకొంటున్నదని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరం.. రీజినల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏషియా పేరుతో వెబినార్ యాప్ ద్వారా నిర్వహించిన సమావేశంలో.. కొవిడ్ 19ను ఎదుర్కోవడంలో టెక్నాలజీ పాత్రపై మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సామాన్య మనిషి జీవితంలో మార్పు తీసుకురాలేని సాంకేతిక పరిజ్ఞానం వృథా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను అధిగమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ దక్షిణాసియా లోని వివిధ దేశాల మంత్రులు, పలు కంపెనీల ప్రతినిధులు, ప్రముఖులతో మాట్లాడారు. వైరస్ నివారణకు సాంకేతిక పరిజ్ఞానం తమకు బాగా ఉపయోగపడిందని తెలిపారు. ఎప్పటికప్పుడు కేంద్రంతో పాటు, స్థానికంగా జిల్లా, గ్రామ అధికారులలతో సంభాషించడానికి టెక్నాలజీ ఉపయోగపడిందని, పలు పట్టణాల్లో డిస్ ఇన్ఫెక్టంట్ల పిచికారీ కోసం డ్రోన్లను కూడా ఉపయోగించామని పేర్కొన్నారు. దీనిద్వారా సంప్రదాయ పద్ధతుల్లో కన్నా మెరుగ్గా వేగంగా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వీలవుతుందని ప్రజల్లో కూడా భరోసా కలిగిందని తెలిపారు.
లాక్డౌన్ సమయంలో ప్రజల కదలికల నియంత్రణ కోసం పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షించారని చెప్పారు. వైరస్ వ్యాప్తి, ఇతర అంశాలకు ప్రజలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్, వెబ్సైట్ను రూపొందించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజలకు రేషన్ సరుకులు అందిచడానికి కూడా ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిందని చెప్పారు. ఈ సంక్లిష్ట సమయంలో అనేక సమస్యలకు పరిష్కారం ఇవ్వడంతోపాటు నూతన అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అవకాశాలను కల్పించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.













