పొత్తులు, కాంగ్రెస్ పార్టీతో విలీనంపై షర్మిల సంచలన కామెంట్స్..!!
తెలంగాణలో సత్తా చాటాలని రాజన్న బిడ్డ షర్మిల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కచ్చితంగా ఈసారి తమదే అధికారమని ధీమగా చెప్తున్నారు. ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశారు షర్మిల. అయితే అవి అనుకున్న విధంగా ఫలితాలు ఇవ్వలేదు. అయినా ఆమె మాత్రం పట్టువదలని విక్రమార్కురాలిలా పోరాడుతున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని తపిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలనూ టార్గెట్ చేసి దుమ్ము దులిపేస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె కాంగ్రెస్ తో కలవబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి.
వై.ఎస్.కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగింది. కాంగ్రెస్ అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే కాంగ్రెస్ అన్నట్టు సాగింది వాళ్ల బంధం. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ తో గ్యాప్ బాగా పెరిగిపోయింది. కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదించి జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఫ్యామిలీ మొత్తం దూరమైపోయింది. ఇప్పుడు షర్మిల అన్నను వదిలేసి తెలంగాణ వచ్చేశారు. ఇక్కడ పార్టీ పెట్టి సత్తా చాటాలనుకుంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆమె బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సమానంగా టార్గెట్ చేశారు. తాను ఎవరి మద్దతుతో పార్టీ పెట్టలేదని, రాజన్న బిడ్డగా వచ్చానని చెప్తున్నారు.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశాలున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్కడ పార్టీ గెలిచిన వెంటనే డి.కె.శివకుమార్ తో ఉన్న ఫోటోను షర్మిల పోస్ట్ చేసి విషెస్ చెప్పారు. దీంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. మరోవైపు బీఆర్ఎస్ తో కలిసే పరిస్థితి లేదు. బీజేపీతో కలిసినా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే కాంగ్రెస్ అయితేనే కాస్తోకూస్తో ప్రయోజనం ఉంటుందనే ఆలోచన రెండు పార్టీల నేతల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే కొన్ని జిల్లాలో ఒకటి రెండు సీట్లయినా దక్కించుకోవచ్చని అంచనా.
అయితే కాంగ్రెస్ తో విలీనం, పొత్తు వ్యాఖ్యలను షర్మిల తీవ్రంగా ఖండించారు. తనకు అలాంటి ఉద్దేశమే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను 44 స్థానాల్లో గెలవబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు షర్మిల అంటే తెలంగాణలో తెలియనివారెవరూ లేరని, తనతో పొత్తు కోసం చాలా మంది కాల్స్ చేస్తున్నారని షర్మిల అన్నారు. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయని.. అయితే తాము ఇంకా ఛార్జింగ్ మోడ్ లోనే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. ఫుల్ ఛార్జ్ అయ్యాక అప్పుడు వాటిపై ఆలోచిస్తామన్నారు. దీంతో పొత్తులు, విలీనం వార్తలపై ఓ క్లారిటీ వచ్చినట్లయింది.













