తెలంగాణ పార్టీల్లో చంద్రబాబు గుబులు..!?
తెలంగాణలో మళ్లీ పునర్వైభవం సాధించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇటీవల అడుగులు వేస్తోంది. టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలను కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగించిన తర్వాత పార్టీలో కాస్త ఊపు వచ్చినట్టు కనిపిస్తోంది. జ్ఞానేశ్వర్ కూడా రోజూ ఎన్టీఆర్ భవన్ వెళ్లి సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేడర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత కేడర్ ను మళ్లీ దగ్గరకు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో భారీ బహిరంగసభలు నిర్వహించడం ద్వారా పార్టీలో జోష్ తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కంచుకోట ఖమ్మంలో చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ సూపర్ సక్సెస్ కావడంతో పార్టీలో జోష్ నెలకొంది. ఇదే సమయంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలకు టీటీడీపీ గుబులు పట్టుకుంది.
తెలంగాణలో టీడీపీకి నాయకులు లేరేమో కానీ ఇప్పటికీ ఆ పార్టీని అభిమానించేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ పార్టీకి సరైన నాయకులు దొరికితే ఆదరించేందుకు కిందిస్థాయి కేడర్ సిద్ధంగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ నాయకుల అన్వేషణలో పడింది. చంద్రబాబు కూడా తమ్ముళ్లూ.. తిరిగి వచ్చేయండి అని పిలుపునిచ్చారు. చంద్రబాబు పిలుపుకు స్పందించి నేతలు మళ్లీ టీడీపీ గూటికి చేరితే ప్రధాన పార్టీలపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ లో ఎక్కువ మంది నేతలు టీడీపీ వాళ్లే. టీడీపీ నుంచే కేసీఆర్ కూడా వెళ్లి పార్టీ స్థాపించి తెలంగాణ సాధించారు. ఆ తర్వాత కూడా టీడీపీ నుంచి ఎక్కువ మంది లీడర్లను పార్టీలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ వల్లే టీడీపీ ఉనికి కోల్పోయిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకుండా పోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీకి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టేందుకు కేసీఆర్ రెడ్ కార్పెట్ పరిచారని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ చంద్రబాబును అడ్డు పెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేశారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఆంధ్రాలో పోటీ చేసేటప్పుడు తెలంగాణలో టీడీపీ పోటీ చేయడంలో తప్పు లేదు. పైగా రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయం అని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ బలపడితే బీఆర్ఎస్ పైన కూడా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. బీఆర్ఎస్ లో అసంతృప్తులు, టీడీపీ నుంచి వెళ్లిన నేతలు మళ్లీ సొంతగూటికి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు దెబ్బే.
మరోవైపు.. బీజేపీకి కూడా టీడీపీతో ఇబ్బందే. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో బీజేపీకి క్షేత్రస్థాయి కేడర్ లేదు కానీ టీడీపీకి ఉంది. ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో టీడీపీ సత్తా చాటగలదని అంచనా వేస్తున్నారు. దాదాపు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటితే ఆ ప్రభావం బీజేపీపై గట్టిగానే ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తప్పకుండా తమకే పడుతుందని బీజేపీ నమ్ముతోంది. ఇప్పుడు టీడీపీ బరిలోకి దిగితే ఆ ఓటు చీలే ప్రమాదం ఉంది. అప్పుడు బీజేపీకి నష్టం జరగడం ఖాయం. అది టీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. అందుకే బీజేపీకి టీడీపీ గుబులు పట్టుకుంది.
మరోవైపు.. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంతే. రేవంత్ రెడ్డి టీడీపీ వర్గీయుడిగా పేరొందారు. ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ సీనియర్లకు, టీడీపీ నుంచి వెళ్లిన వాళ్లకు మధ్య పోరు నడుస్తోంది. ఈ పోరు తారస్థాయికి వెళ్తే కాంగ్రెస్ నుంచి టీడీపీ వర్గీయులంతా మళ్లీ సొంతగూటికి వెళ్లే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరగడం ఖాయం. రేవంత్ వల్లే మళ్లీ కాంగ్రెస్ కాస్తోకూస్తో నిలబడగలదని భావిస్తున్నారు. అలాంటి రేవంత్ తన వర్గంతో బయటికొస్తే కాంగ్రెస్ అటూఇటూ కాకుండా పోవడం ఖాయం. మొత్తానికి ఖమ్మం సభతో చంద్రబాబు తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకూ గట్టి సంకేతాలే పంపారు.













