తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్..! బిల్లుల ఆమోదంపై తమిళిసై హాట్ కామెంట్స్..!!
తెలంగాణ గవర్నర్ – గవర్నమెంట్ మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది. కొంతకాలంగా ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తాజాగా దీపావళి పండగ రోజు కూడా ఆమె బాంబ్ పేల్చారు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుల ఆమోదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని ఆమోదించాలా.. వద్దా అనే నిర్ణయాధికారం తనకుందని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ తొక్కిపెట్టారని ప్రభుత్వం విమర్శిస్తోంది. దీంతో మరోసారి గవర్నర్ – గవర్నమెంట్ మధ్య విభేదాలు తలెత్తాయి.
తెలంగాణ ప్రభుత్వం తనను పట్టించుకోవట్లేదని కొంతకాలంగా గవర్నర్ ఆరోపిస్తున్నారు. తాను ఎక్కడికెళ్లినా కనీసం సౌకర్యాలు కల్పించట్లేదని.. జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రోటోకాల్ కూడా పాటించట్లేదని ఆమె తెలిపారు. మేడారం వెళ్లినప్పుడు హెలికాప్టర్ కూడా ఇవ్వలేదని.. తాను రైల్లో వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే రాజ్ భవన్ లో కనీస సౌకర్యాలను కూడా కలిగించట్లేదని విమర్శించారు. ఇటీవల ఆమె చెన్నైలో పుస్తకావిష్కరణ సమయంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో ఖర్చంతా తనదేనన్నారు. ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి ఆమె ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను ఆమోదించే సర్వాధికారాలూ తనకు ఉన్నాయన్నారు గవర్నర్ తమిళిసై. తన పరిధికి లోబడి వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని.. బాధ్యతలకు లోబడి పని చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం గవర్నర్ వద్ద 8 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 6 బిల్లులు చట్టసవరణకు సంబంధించినవి కాగా.. రెండు కొత్తవి. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపెట్టారని.. టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కావాలనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చట్టబద్దంగా పని చేయాల్సిన గవర్నర్.. పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు.
ఇప్పుడు గవర్నర్ ఎన్ని బిల్లులను ఆమోదిస్తారు.. అసలు ఆమోదిస్తారా.. లేకుంటే అలాగే యదాతథ స్థితిని అవలంబిస్తారా.. అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే దానికి గవర్నర్ ఆమోదం తెలపలేదు. అక్కడ నుంచి ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది. మొదట్లో ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. అయితే ఆ తర్వాత ఇరువురి మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. బీజేపీ నేతలా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ వచ్చారు. అటు గవర్నర్ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ వైఖరిని విమర్శించడం మొదలు పెట్టారు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..!













