Telangana : తెలంగాణలో పిట్ట పోరు.. పిల్లి తీర్చబోతోందా..?

తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. బీజేపీకి ఈ రెండూ లేవు. అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ జుట్టు మాత్రం కమలం పార్టీ చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. హోదా ఏమీ లేకపోయినా బీజేపీ మాత్రం చక్రం తిప్పేందుకు అన్ని అర్హతలూ దక్కించుకుంటున్నట్టు అర్థమవుతోంది.
తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనేక అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే తాము అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వెలికితీసి శిక్షిస్తామని ప్రతినపూనింది. అందులో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్ లాంటి అంశాలపై కేసులు నమోదు చేసింది. విచారణ జరుపుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్వవహారంలో నాటి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఓ సంస్థకు నిధులు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగా ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బీజేపీ నియమించిన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇందుకు అనుమతిస్తారా.. లేదా .. అనేది తెలీదు.
ఇక.. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి.. అక్రమంగా తన బావమరిది కంపెనీలకు అమృత్ టెండర్లను కట్టబెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సెప్టెంబర్ లోనే అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగాయని కేటీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి రేవంత్ రెడ్డి అండ్ కో పై ఫిర్యాదు చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తోంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేసే అధికారాన్ని బీజేపీకి కట్టబెడుతోంది బీఆర్ఎస్.
వాస్తవానికి ఇలాంటి అవకాశాలకోసమే కేంద్రంలోని బీజేపీ ఎదురు చూస్తూ ఉంటుంది. దేశంలో ఏ పార్టీ అయినా తమపై ఆధారపడాలనుకుంటుంది. ఇప్పుడు తెలంగాణలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ తమపైన ఆధారపడే స్థాయికి రావడం బీజేపీ శ్రేణుల్లో సంతోషం నింపుతోంది. ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్లపై కేసులు పెట్టి విచారణ జరిపించే అవకాశం ఇప్పుడు బీజేపీ చేతుల్లో ఉంది. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్లే. అదే సమయంలో కేటీఆర్ చేసిన ఫిర్యాదులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విచారణకు కేంద్రం మొగ్గు చూపితే బీఆర్ఎస్ విజయం సాధించినట్లే. మొత్తానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుంటూ తమ జుట్టును బీజేపీ చేతుల్లో పెడ్తున్నాయన్నమాట.!