పార్టీలకు మునుగోడు నేర్పిన గుణపాఠం ఏంటి..!?
మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. అన్ని పార్టీలూ హోరాహోరీ తలపడ్డాయి. చివరకూ అధికార టీఆర్ఎస్ గెలిచింది. అయితే వచ్చిన మెజారిటీపై టీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే బీజేపీ, కాంగ్రెస్ కూడా ఉపఎన్నికలో ఓటమిపై తర్జనభర్జన పడుతున్నాయి. గెలిచిన టీఆర్ఎస్, ఓడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అంతర్మథనం చెందుతున్నాయి. ఎంతో కష్టపడ్డాం.. డబ్బులిచ్చాం.. మందు పోసాం.. అడిగింది కాదనకుండా ఇచ్చాం.. అయినా ఫలితం ఇలా వచ్చిందేంటి అనే ప్రశ్న అన్ని పార్టీలనూ తొలచివేస్తోంది. ఇంతకూ మునుగోడు ఫలితం నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిందేంటి..?
మునుగోడు ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. దేశంలో ఇదే అత్యంత ఖరీదైన ఎన్నికగా ప్రచారం జరిగింది. 300 కోట్ల రూపాయలకు పైగానే ఇక్కడ పార్టీలు ఖర్చుపెట్టినట్టు అనధికార అంచనా. సమయం ఉంటే ఇంకెంత పెట్టడానికైనా పార్టీలు సిద్ధమైపోయాయి. అసలు ఈ ఎన్నికను పార్టీలు ఎందుకంత సీరియస్ గా తీసుకున్నాయంటే… ఇక్కడ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అనీ ఫీలింగ్ కలిగించాయి. దీన్ని సెమీ ఫైనల్ గా భావించాయి. ఇక్కడ గెలిస్తే ఫైనల్స్ లో విజయం ఖాయమని నమ్మాయి. అందుకే ఇక్కడ గట్టిగా పట్టుబట్టాయి. ఎన్నిక అన్న తర్వాత ఒకరు గెలుస్తారు.. మిగిలిన వాళ్లు ఓడిపోతారు.. అది కామన్. ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది.. మిగిలిన పార్టీలు ఓడాయి.
మునుగోడు బైపోల్ ఎన్నికల తీరునే మార్చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ ఓటర్లు పార్టీలను ముప్పతిప్పలు పెట్టారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల నుంచి డబ్బు, మద్యం తీసుకున్నారు ఓటర్లు. కొన్ని చోట్ల డిమాండ్ చేసి మరీ లాక్కున్నారు. డబ్బులు అందని వాళ్లు వీధుల్లోకి వచ్చి రచ్చ చేశారు. నేతలను నిలదీశారు. అందరి దగ్గరా తీసుకుని తమకు నచ్చిన వాళ్లకే ఓటేశారు. దీంతో మిగిలిన పార్టీలు ఓటర్లపై ఆగ్రహంతో ఉన్నాయి. అయితే పార్టీలకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అన్నట్టు ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సందర్భాల్లో నేతలు తమ మొహం చూడట్లేదనే కోపం ఓటర్లలో ఉంది. అందుకే తమ దగ్గరకు వచ్చినప్పుడు వీలైనంత సొమ్ము చేసుకోవాలనే ఆలోచన వచ్చేసింది ఓటర్లకు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడు దున్నేస్తున్నారు.
ఇక పార్టీలకు కూడా ఇదొక గుణపాఠమే. టీఆర్ఎస్ తన 80మందికి పైగా ప్రజాప్రతినిధులను మునుగోడులో దింపింది. నెల రోజులపాటు అక్కడే మకాం వేయించింది. ఒక్కో ఓటుకు 5వేల రూపాయలు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాక అధికారికంగా పలు పథకాలతో నిధులు కుమ్మరించింది. మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫ్లోరైడ్, పోడు భూములు, దళితబంధు, రైతు బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రోడ్లు.. ఇలా అనేక హామీలు గుప్పించారు. చివరకు బొటాబొటి మెజారిటీతో బయటపడ్డారు. ఈ మెజారిటీతో టీఆర్ఎస్ ఏమాత్రం సంతృప్తిగా లేదు. కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ మెజారిటీతో బయటపడ్డామని.. లేకుంటే బోల్తా పడేవాళ్లమేమో.. అనే ఆలోచన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఓటర్లు ఇంతకు మించి ఇంకేదో ఆశిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది.. అటు బీజేపీ పరిస్థితి కూడా ఇంతే. రోజగోపాల్ రెడ్డి చరిష్మా, బీజేపీ అధికార దన్ను ఉన్నా కూడా ఓడిపోవడం ఆ పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ కు గండి కొట్టినట్లయింది. ఇక్కడ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించేయొచ్చని వేసిన ఎత్తుగడకు మునుగోడు చెక్ పెట్టింది. అయితే సెకండ్ ప్లేస్ దక్కడం ఒక్కటే ఆ పార్టీకి కాస్త ఊరట కలిగించింది. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. ఇది సిట్టింగ్ స్థానం. దాన్ని పోగొట్టుకోవడమే కాకుండా డిపాజిట్ కోల్పోవడం అంటే అంతకుమించిన పరాభవం మరొకటి లేదు. టీఆర్ఎస్, బీజేపీ అంత కాకపోయినా తమ స్థాయికి తగ్గట్టు కాంగ్రెస్ కూడా డబ్బు పంచింది. అయినా ఓటరు అస్సలు పట్టించుకోలేదు.
మునుగోడు ఎన్నిక తర్వాత పార్టీలన్నీ ఆలోచించుకోవడం మొదలుపెట్టాయి. డబ్బున్నా, అభ్యర్థులు గట్టి వాళ్లయినా, ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నా.. ఓటర్లు పట్టించుకోవట్లేదు. కాబట్టి పార్టీలన్నీ తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది.













