మల్లా రెడ్డా.. మజాకా..! మళ్లీ ఏసేశాడుగా..!!
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏం మాట్లాడినా అదొక సంచలనమే. ఆయన చేష్టలు కూడా అలాగే ఉంటాయి. ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు విరబూస్తాయి. ఆయన కామెడీగా అన్నాడో .. సీరియస్ గా చెప్పాడో కూడా అర్థం కాదు. అందుకే ఆయన మాటలను జోక్ గా తీసుకునే వాళ్లే ఎక్కువ. కానీ వాటి వెనుక ఎన్నో అంతరార్థాలు వెతుక్కునే వాళ్లు కూడా ఉంటారు. వాటిని పట్టుకుని కొంతమంది మల్లారెడ్డిని రచ్చకు ఈడుస్తుంటారు. తాజాగా అలాంటి అవకాశమే మరొకటి ఇచ్చారు మల్లారెడ్డి.
ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలతో లాబీ అంతా సందడిగా మారింది. ఇంతలో మల్లారెడ్డి అక్కడ కనిపించగానే అందరూ పలకరించడం మొదలు పెట్టారు. మీడియా కూడా మల్లారెడ్డితో ముచ్చటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటుంది. అలా మాట్లాడుతున్న క్రమంలో మల్లారెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆసక్తికరం అనడమే కాకుండా వివాదాస్పదం అని కూడా అనొచ్చు. మేడ్చల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల అభ్యర్థులను కూడా తానే డిసైడ్ చేస్తానన్నారు మల్లారెడ్డి. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
మేడ్చల్ లో ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థిని తానే డిసైడ్ చేస్తానన్నారు మల్లారెడ్డి. గత ఎన్నికల్లో కేఎల్ఆర్ కు తానే టికెట్ ఇప్పించినట్లు చెప్పారు. అంతటితో ఆగకుంటా మేడ్చల్ లో కాంగ్రెస్ గ్రూపు గొడవలను కూడా తామే సృష్టిస్తామన్నారు. తన మనుషులను హరివర్ధన్ వర్గం కార్యకర్తలుగా పంపి కేఎల్ఆర్ ను నిలదీసినట్టు చెప్పారు మల్లారెడ్డి. దీంతో లాబీలో ఉన్న వాళ్లంతో నవ్వుకోవడంతో పాటు ఆశ్చర్యపోయారు. మల్లారెడ్డి సరదాగా కనిపిస్తారేమో కానీ తెలివైన వ్యక్తి. పాలు అమ్ముకునే స్థాయి నుంచి ఇవాళ మంత్రిగా, విద్యావంతుడిగా పేరొందినట్టు ఇటీవల మల్లారెడ్డే చెప్పుకొచ్చారు. దీని వెనుక ఎంతో విజన్ ఉందన్నారు.
అంతటితో ఆగని మల్లారెడ్డి వచ్చే ఎన్నికల్లో చేయబోయే ఖర్చు పైనా స్పందించారు. ఇటీవల మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. విద్యా సంస్థల్లో అక్రమ అడ్మిషన్లకు సంబంధించి కొంత నగదును పట్టుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాను గదిలో దాచిన డబ్బులను ఐటీ అధికారులు చూడలేదని ఇవాళ మల్లారెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఆ డబ్బునే ఖర్చు పెట్టబోతున్నట్టు తెలిపారు. దీంతో మల్లారెడ్డి మళ్లీ ఏసేశాడుగా.. అని అందరూ నవ్వుకున్నారు. అక్కడ మల్లారెడ్డి మాటలను జోక్ గా తీసుకున్నా… తానునిజమే చెప్పి ఉండొచ్చేమో .. అని అందరూ అనుకుంటున్నారు.













