కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి భయమెందుకు?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ఎన్నోసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్బందుల్లోకి నెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సాహసించట్లేదు. ఎందుకు కోమటిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తుంది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు ధైర్యం చేయట్లేదు. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. చాలాకాలంగా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కోమటిరెడ్డి ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కోమటిరెడ్డి సంపాదించుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గా చలామణి అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా వాళ్లకు మంచి పేరుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానాలను అధిరోహించారు. పిసిసి చీఫ్ పదవి కోసం సోదరులు ఇద్దరు ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిసిసి పగ్గాలు అప్పగించింది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో అనేక సమస్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ రేవంత్‌కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. అయినా అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గుచూపుతోంది. దీంతో సీనియర్ లందరూ ఆయనకు సహకరించకుండా అసంతృప్తగళం వినిపించడం మొదలుపెట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, పనిచేయడం ప్రారంభించారు. ముఖ్యంగా సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందీప్తంలో పడ్డారు. ఒకానొక దశలో ఆయన కూడా బిజెపిలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నారు.
తాజాగా బి.ఆర్.ఎస్., కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ రెండు సెక్యులర్ పార్టీలు కాబట్టి కలిసిపోతే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవచ్చని కోమటిరెడ్డి చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ కు, బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే కోమటిరెడ్డి మాత్రం కెసిఆర్ తో కలిసి పని చేయాలని సూచించడం సంచలనం కలిగించింది. కోమటిరెడ్డి వ్యాఖ్యల తర్వాత టిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బిజెపి ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇది మరిన్ని ఇబ్బందులకు కారణమవుతోంది. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త సమస్యలు తెచ్చి పెడుతూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.
అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవడానికి అధిష్టానం ఎందుకు వెనుకాడుతోంది అని పార్టీలోని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీలోని కొందరు సీనియర్ నేతలు కోమటిరెడ్డి కి వంత పాడుతూ మద్దతిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు కొత్త కాదు. ఆ పార్టీలో ఇలాంటివి అలవాటే. అయితే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.













