కేసీఆర్ ఫ్రంట్ అటకెక్కినట్టేనా..? ఎంత కష్టమొచ్చిందో పాపం..!!
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే పాలిస్తున్నాయి. అయితే 75 ఏళ్లయినా దేశం పురోభివృద్ధి సరైన మార్గంలో జరగట్లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీల చేతకానితనం వల్ల దేశం అధోగతి పాలవుతోందని.. మన కంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి సాధించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన చెప్తున్నారు. అందుకే ఆ రెండు పార్టీలను ఇంటి సాగనంపేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని ఆయన స్పష్టం చేశారు. తాను ఆ బాధ్యత తీసుకుంటానని, బీజేపీ – కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని కేసీఆర్ వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆయన ఆశలపై ఆ రెండు పార్టీలూ నీళ్లు చల్లినట్లయింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వారి నేతృత్వంలోని కూటములకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రత్యామ్నాయ వేదికను తయారు చేయాలని కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్ లకు దూరంగా ఉన్న పలు పార్టీలను ఆయన పలుమార్లు కలిశారు. మమత బెనర్జీ, నితీశ్ కుమార్, స్టాలిన్, కుమారస్వామి, నవీన్ పట్నాయక్, అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే.. లాంటి ఎంతోమంది నేతలను ఆయన కలిసి తన ప్రతిపాదనను వాళ్ల ముందు ఉంచారు. వాళ్లు కూడా సానుకూలంగానే స్పందించారు. వీళ్ల దూకుడు చూశాక నిజంగా వీళ్లంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికలకు వెళ్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇబ్బందులు తప్పవేమో అనిపించింది. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి కేసీఆర్ ఏదో చేయబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా గొప్పగా చెప్పుకున్నాయి.
కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కేసీఆర్ కలిసి ప్రత్యామ్నాయ వేదికను తయారు చేయాలనుకున్న పార్టీలన్నీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీ కూటమిలో భాగస్వాములయ్యాయి. మమత, నితీశ్, కుమారస్వామి, ఉద్దవ్ ఠాక్రే లాంటి నేతలంతా అటు ఎన్డీయేలోనో, ఇటు ఇండియాలోనో చేరిపోయారు. కేసీఆర్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. ఆయన కూటమికోసం చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు విఫలమైనట్టే. ఎందుకంటే కేసీఆర్ నమ్మకం పెట్టుకున్న పార్టీలన్నీ ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చాయి. పైగా కేసీఆర్ ను పట్టించుకోవడం మానేశాయి. కనీసం కేసీఆర్ కు పిలుపు కూడా అందలేదు. తమ కూటమిలో చేరాల్సిందిగా ఏ పార్టీ కూడా కేసీఆర్ కు ఆహ్వానం పంపలేదు.
బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని కేసీఆర్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. దీంతో ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరొచ్చని భావించారు. అయితే తెలంగాణలో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. కాబట్టి ఆ కూటమిలో చేరే అవకాశమే లేదు. అంతేకాక బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ కలిసిన మితృలంతా ఇప్పుడు ఆయన్ను దూరం పెట్టడానికి ఇది కూడా ఒక కారణం. కవిత అరెస్టు కాకపోవడం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆగిపోవడం.. లాంటివన్నీ బీజేపీ – బీఆర్ఎస్ మధ్య ఏదో ఉందనే అనుమానాలకు తావిస్తున్నాయి. అందుకే ఎవరూ కేసీఆర్ ను నమ్మట్లేదు. ఆయన్ను పూర్తిగా దూరం పెట్టేశాయి. కాబట్టి ఎన్నికల ముందు కేసీఆర్ ఏ కూటమితోనూ కలిసే అవకాశం లేకుండా పోయింది. ఏదైనా ఎన్నికల తర్వాతే చూడాలి మరి.













