ఈడీకి ట్విస్ట్ ఇచ్చిన కవిత..! నెక్స్ట్ ఏంటి..?
ఊహించినట్లే ఢిల్లీ లిక్కర్ కేసు పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఇవాళ ఈడీ ముందుకు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు హాజరు కాకుండా ఆమె మినహాయింపు కోరింది. ఈ కేసుపై తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందున.. దానిపై క్లారిటీ వచ్చేంత వరకూ ఈ విచారణ ఆపాలని ఈడీకి లేఖ రాసింది కవిత. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠ మరింత పెరిగింది.
11న విచారణ సందర్భంగా కవితను అరెస్టు చేయడం ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే ఆరోజు కవిత ఫోన్ స్వాధీనం చేసుకున్న ఈడీ.. కవితను అరెస్టు చేయలేదు. ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో ఈరోజు కవిత విచారణకు హాజరైతే అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కవిత అరెస్టు ఖాయం అని.. అందుకే కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలను ఆరా తీస్తున్నారు.
ఇంతలో కవిత లేఖ ఒకటి బయటికొచ్చింది. తాను సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుపై పిటిషన్ వేశానని.. దానిపై కోర్టు క్లారిటీ ఇచ్చేంత వరకూ విచారణ ఆపాలని ఆమె ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. న్యాయనిపుణుల సూచన మేరకే ఆమె ఈ లేఖ రాసినట్లు అర్థమవుతోంది. అయితే కవిత లేఖపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. కవిత విజ్ఞప్తి మేరకు వెసులుబాటు ఇస్తుందా.. లేకుంటే విచారణకు హాజరు కావాల్సిందేనని అల్టిమేటం జారీ చేస్తుందా.. అనేది తెలియాల్సి ఉంది.













