ఈటల రాజేందర్ మళ్లీ టీఆర్ఎస్లో చేరనున్నారా..? మరో కీలక నేత కూడా..!?
ఇవాళ ఉదయం నుంచి ఓ వార్త తెలంగాణలో సంచలనం కలిగిస్తోంది. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతోంది. దీంతో బీజేపీ శ్రేణులు షాకు తింటుంటే.. టీఆర్ఎస్ వర్గాలు మాత్రం సంబరాల్లో ఉన్నాయి. అయితే ఈ వార్తలో వాస్తవం ఉందో లేదో తెలీదు కానీ ఊహాగానాలు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి బీజేపీని వీడితే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే మునుగోడు ఓటమితో బీజేపీ నిరాశానిస్పృహల్లో మునిగిపోయింది. ఇప్పుడు ఈటల కూడా బయటకు వెళ్తే మాత్రం కమలం కోలుకోవడం కష్టమనేనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్ పోరాటయోధుడు. నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి ఈటల కేసీఆర్ కు కుడిభుజంగా ఉంటూ వచ్చారు. కేసీఆర్ ఎంపీగా ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈటల రాజేందర్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఈటల. అనంతరం రెండోసారి టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టాక వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారు కేసీఆర్. అప్పటి నుంచి వారి మధ్య గ్యాప్ మొదలైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ దూరం పెట్టారో.. ఈటల దూరమయ్యారో కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనేది మాత్రం వాస్తవం. అది క్రమేణా పెరిగి పెద్దదవుతూ వచ్చింది. చివరకు ఈటల భూఆక్రమణలకు పాల్పడ్డారంటూ ప్రభుత్వం అభియోగాలు మోపింది.. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు.
టీఆర్ఎస్ నుంచి బయటకు రాగానే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినప్పుడే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజానామా చేశారు. దీంతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. హుజూరాబాద్ ప్రజలు ఈటలకే జైకొట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలో ఈటల గెలుపొందడంతో బీజేపీ అధిష్టానం కన్ను ఈటలపై పడింది. మోదీ, అమిత్ షా లాంటి నేతలు ఈటలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీలో ప్రస్తుతం చేరికల కమిటీకి ఛైర్మన్ గా ఉన్నారు ఈటల. ఆయన ఆ బాధ్యతలు చేపట్టాక చేరికలు ఊపందుకున్నాయనే ప్రచారమూ ఉంది. ఇదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని మునుగోడు బైపోల్ కు కారణమైంది బీజేపీ. ఇక్కడ ఓడిపోవడంతో ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.
మునుగోడు ఉపఎన్నికలో ఓటమికి నువ్వంటే నువ్వే కారణమంటూ బీజేపీలో పలువురు నేతలు విమర్శించుకుంటున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక బాధ్యతలను వివేక్, ఈటల నిర్వర్తించారు. ఓటమి తర్వాత బీజేపీలో టాప్ కేడర్ వీరిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు వీరే కారణమంటూ అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. దీంతో వీళ్లిద్దరూ కాస్త అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇదే అదనుగా భావించిన టీఆర్ఎస్ అధిష్టానం ఈటలతో పాటు వివేక్ ను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. వీళ్లిద్దరూ వస్తామంటే చేర్చుకునేందుకు టీఆర్ఎస్ రెడీ.. అయితే వీళ్లు చేరుతారా లేదా అనేదే తెలీదు. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













