బీఆర్ఎస్కు బై బై..! కాంగ్రెస్కు హాయ్ హాయ్…!!
తెలంగాణలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. పార్టీలన్నీ ఫుల్ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి లబ్ది పొందేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీలో ఇంతకు ముందు ఉన్నంత జోష్ కనిపించడం లేదు. అయినా తమదే విజయమంటోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతల చూపంతా కాంగ్రెస్ వైపే ఉంది. కేసీఆర్ ను ఓడించడం కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరేందుకు ఎంతోమంది నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు.
2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కారెక్కేశారు. ఆయా నియోజకవర్గాల్లో ముందు నుంచి బీఆర్ఎస్ లో ఉన్న నేతలకు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇన్నాళ్లూ నోరు మెదపని నేతలు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో గళం వినిపిస్తున్నారు. తమకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందేనని పట్టు బడుతున్నారు. లేకుంటే పార్టీని వీడుతామని హెచ్చరిస్తున్నారు. తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను పార్టీని వీడుతానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హెచ్చరించారు. అలాగే మహేశ్వరంలో తనను కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి టికెట్ ఇస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితే చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఎమ్మెల్యే సీట్లు ఆశిస్తున్న నేతల సంఖ్య భారీగా ఉండడంతో నేతలకు సర్దిచెప్పడం అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది. పట్నం మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తీగల అనితా రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి లాంటి నేతలంతా బీఆర్ఎస్ లో ఇమడలేక పార్టీ మారేందుకు సిద్ధమయయారు. రేపోమాపో వీళ్లంతా కారు దిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు ప్రతి జిల్లాలో ఇలాంటి అసంతృప్తులు బీఆర్ఎస్ లో ఉన్నారు. ఎన్నికల నాటికి సీటు హామీ లభించని నేతలంతా ఇతర పార్టీల్లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది అధికార పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పుకోవచ్చు.
బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలంతా కాంగ్రెస్ వైపే చూస్తుండడంతో ఆ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. నిన్నమొన్నటి వరకూ బీజేపీ వైపు చూసిన నేతలు.. ఇప్పుడు హస్తం వైపు చూడడం పెద్ద ప్లస్ గా మారింది. పొంగులేటి లాంటి నేతలు రావడం పార్టీకి ఊపు తెచ్చింది. త్వరలోనే జూపల్లి కృష్ణారావు, తీగల కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి.. లాంటి నేతలు కూడా చేరబోతున్నారు. ఇన్నాళ్లూ బలమైన లీడర్లు లేక కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బంది పడింది. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సత్తా కలిగిన నేతలు లేరు. ఇప్పుడు ఆ సమస్య తీరిందని భావిస్తున్నారు. దీంతో ఆ పార్టీ కచ్చితంగా అధికారంలోకి రాగలమనే నమ్మకంతో ఉంది.













