కేంద్ర కేబినెట్లోకి బండి సంజయ్..! రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల!?
2023 సంవత్సరంలో ఎన్నికల జాతర జరగబోతోంది. దాదాపు 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలోని అధికార బీజేపీ ఈ విషయంలో ఇంకొంచెం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్ గా భావిస్తున్న బీజేపీ.. ఈ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు. తెలంగాణకు కూడా ఇందులో స్థానం దక్కబోతోంది.
2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను ఓడించి అధికారంలోకి రాబోతున్నామని బీజేపీ ఎప్పటి నుంచో చెప్తోంది. తాము ఈజీగా అధికారంలోకి రాగలమని భావిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేంద్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. గతంతో పోల్చితే ఇప్పుడు తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉందని.. కాస్త కష్టపడితే ఇక్కడ అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాబోదని బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లే రాష్ట్రంలో బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవడం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లడం లాంటి చర్యలతో బీజేపీ యాక్టివ్ గా కనిపిస్తోంది.
తెలంగాణ నుంచి మరో ఎంపీకి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కబోతోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే తెలంగాణ తమకు ఎంతో కీలకమని, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు కేంద్ర కేబినెట్లో మరొకరికి స్థానం కల్పించాలని మోదీ భావిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు మరొక కీలక నేతకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రజల్లో మరింత పాజటివ్ దృక్పధాన్ని పొందవచ్చని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కేంద్ర కేబినట్లో స్థానం దక్కడం ఖాయమని ప్రచారం జోరందుకుంది. సంక్రాంతి రోజు అంటే జనవరి 14న కేంద్ర కేబినెట్ ను ప్రధాని మోదీ విస్తరించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విస్తరణలో బండి సంజయ్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పదవీకాలం జనవరి నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో ఈటల రాజేందర్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర కేబినెట్లోకి వెళ్లడం కంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగేందుకే బండి సంజయ్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. అయితే బండి సంజయ్ ని కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా ఆయన సేవలను మరింతగా వాడుకోవాలనే ఆలోచనలో కేంద్ర పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ అయితేనే కేసీఆర్ ను సమర్థంగా ఎదుర్కోగలరని.. పైగా బండి సంజయ్ లాగా ఆవేశంతో కాకుండా ఆలోచనతో వ్యవహరించగలరని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం.













