హైదరాబాద్ చుట్టూనే తిరగం : కేటీఆర్
హైదరాబాద్ నగరం చుట్టే ఐటీ ఇండస్ట్రీని తిప్పాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం ఎంత మాత్రమూ కాదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీని విస్తరిస్తున్నామని వివరించారు. అయితే దేశంలోని ఇతర నగరాలను వదిలేసి హైదరాబాద్కు వస్తున్నారంటే ప్రభుత్వ విధానాలతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా కారణమని వివరించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అన్ని ప్రాంతాలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా మంది అనేక సందేహాలుండేవని, పెట్టుబడులు వెనక్కి పోతాయన్న ప్రచారాన్ని కూడా చేశారని గుర్తు చేసుకున్నారు. కానీ సమర్థుడైన సీఎం, స్థిరమైన ప్రభుత్వం వల్ల ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడే సమయంలో ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉంటే, 2021 నాటికి లక్షా 40 వేల కోట్ల రూపాయలకు దూసుకెళ్లిందని తెలిపారు. కార్గో లాంటి వినూత్నమైన ఆలోచనలతో ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నామని అన్నారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని, కేటీఆర్ హామీ ఇచ్చారు.













