రోడ్డు ప్రమాదంలో మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ(22), అతడి స్నేహితుడు రవిచంద్ర(23) దుర్మరణం చెందారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిషిత్, రాజా రవిచంద్ర జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు బెంజ్ కారు (టిఎస్ 07ఎస్కే 7117)లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదపుతప్పి మెట్రో పిల్లర్ నెం-9 బలంగా ఢీకొట్టింది. కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అపోలో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎస్.వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కారును తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ కుమారుడి మరణ వార్త వినగానే హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. నిశిత్ మరణ వార్తను విన్న మంత్రి నారాయణ భార్య, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి చేరుకున్నారు.













