తెలంగాణలో మళ్లీ చరిత్ర సృష్టిద్దాం : చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునరుత్తేజానికి నేను రావాల్సిన అవసరం ఉందని ఇక్కడి నాయకులు కోరుకుంటున్నారు. ఇకపై తరుచుగా వస్తా మార్గదర్శనం చేసి పార్టీని నడిపిస్తా అని తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహానాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో మనం కొన్ని చరిత్రలు సృష్టించాం. మరోసారి చరిత్ర సృష్టిద్దాం. ఈ రోజు ఈ సమావేశం నాకు ఎంతో ఆనందం కలిగించింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన మహానాడులకు మించి ఈ సమావేశంలో కోలాహలం, ఉత్సవాం కనిపిస్తున్నాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీని నిలబెట్టాలన్న మీ పట్టుదల, దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ప్రతి కార్యకర్త బొబ్బిలిపులిలా, కొండవీటి సింహంలా కదిలి పనిచేయండి. మూడేళ్లుగా తెలంగాణలో ప్రజల కోసం ఎనో ్న పోరాటాలు చేశారు. ఈ పోరాటాల్లో పాల్గొన్నవారందరికీ నా అభినందనలు. వచ్చే రెండేళ్లు కూడా ప్రజల కోసం పోరాడండి అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పొత్తుల విషయం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిద్దామని, ఇప్పుడు దాని గురించి ఎవరూ మట్లాడవద్దని సూచించారు. యాబై రోజుల్లో తెలంగాణలో ఏడున్నర లక్షల సభ్యత్వం చేశారు. చాలా బాగా చేశారు. ఇదే మాదిరిగా కమిటీలను వేసుకోండి. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో పుట్టింది. పార్టీ జెండాను కూడా ఇక్కడే రూపం దిద్దాం. అన్న ఎన్టీఆర్ తన చైతన్య యాత్రకు ఇక్కడే శ్రీకారం చుట్టారు. ఆయన పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గొప్పది. ఎన్ని సమస్యలు వచ్చినా ఈ పార్టీని ఎవరూ ఏమీ చేయలేకపోయారు అని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో, హైదరాబాద్లో ప్రతి అడుగులో తెలుగుదేశం ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఉందన్నారు.













