రూకోటి పది లక్షల లంచం గిన్నీస్‌బుక్ లోకి?
గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలంటే ఏం చేయాలి? ఏదో ఒక వింత చేయాలి. అది ప్రపంచస్థాయి వింత అయి ఉండాలి. అంతకు ముందు ఎవరూ చేయని లేదా కొంత వరకే సాధించిన గొప్ప లక్ష్యమై ఉండాలి. అప్పుడే అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కుతుంది. దాదాపుగా ఇలాంటి లక్షణాలు అన్నీ ఉండడంతో ఆయన విజయాన్ని నమోదు చేయాలంటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేశారు. ఇంతకీ ఆయనెవరు అంటే కీసర ఎమ్మార్వో నాగరాజు. ఆయన సాధించిన ఘనత ఏమిటంటే ఏకంగా కోటీ పది లక్షల రూపాయలు లంచంగా నగదు రూపంలో స్వీకరించడం.
ఎసిబి వాళ్లు రైడ్ చేసి భారీ లంచం తీసుకున్న కీసర ఎమ్మార్వోని పట్టుకున్న రోజున టీవీలలో పదే పదే ప్రసారమైన ఆ వార్త కధనం చూసిన వారికి కంటపడిన నోట్ల కట్టలు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. ఫెళఫెళలాడే ఆ నోట్ల కట్టల మొత్తం ఏకంగా కోటి రూపాయల పదిలక్షలని, అది ఒక భూమికి సంబంధించిన లావాదేవీల్లో అడ్వాన్స్ రూపంలో ఎమ్మార్వోకి అందిన మొత్తమని తెలిసి తెలుగు రాష్ట్రాలు విస్తుపోయాయి. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతోంది.
ఈ నేపధ్యంలో కీసర ఎమ్మార్వో తీసుకున్న లంచం మొత్తాన్ని బట్టి ఆయన ఘనతను గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించాలని 2 స్వఛ్చందసంస్థలు గిన్నిస్ బుక్ ప్రతినిధులకు దరఖాస్తు చేయడం విశేషం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే యూత్ ఫర్ యాంటి కరప్షన్ సంస్థ, వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించే జ్వాల సంస్థ లు ఆన్లైన్లో ఈ దరఖాస్తు చేశాయి. తమకు తెలిసి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) అధ్యక్షుడు పల్నాటి రాజేందర్ అన్నారు. అయితే, వీరి దరఖాస్తుపై గిన్నిస్ సంస్థ స్పందించింది. ఇంతవరకు ప్రభుత్వ అధికారుల అవినీతి రికార్డులకు సంబంధించిన కేటగిరీ తమ దగ్గర లేదని స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ కేటగిరి ప్రారంభించే ఆలోచన ఉంటే వీరి అభ్యర్ధనను పరిశీలిస్తామంది.













