ఎన్నారైలంతా సీఎం కేసీఆర్ వెంటే

ఎన్నారైలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని ఎన్నారై టీఆర్‍ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం స్పష్టం చేశారు. ఎన్నారైలు ఎప్పుడు కూడా అవినీతి రహిత సమాజాన్ని కోరుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. అమెరికాలోని కొంతమంది ఎన్నారైలతో ఈటల రాజేందర్ జూమ్ ద్వారా సమావేశమైనట్లు వార్తల్లో చూశానని, వారంతా నిన్నటి దాకా టీఆర్‍ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారేనని తెలిపారు. ఈటల 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆ ఎన్నారైలు ఒక్కరోజు కూడా ఆయనకు మాట సాయం చేయలేదన్నారు. కొంతమంది అవకాశవాదులే ఈటలతో సమావేశం పెట్టారని ఆరోపించారు. దమ్ముంటే ఈటలకు నేటి వరకు ఏ రకంగా అండగా ఉన్నారో చెప్పాలని అనిల్ వారికి సవాల్ విసిరారు. ఈటలతో జూమ్ ద్వారా మాట్లాడిన ఎన్నారైలంతా టీఆర్‍ఎస్ వ్యతిరేకులు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు అని ఆరోపించారు. ఈటలతో సమావేశమైన ఎన్నారైలను చూసి పలువురు నవ్వుకుంటున్నారని అనిల్ పేర్కొన్నారు.