ఈటల తన రాజకీయ ప్రయోజనాల కోసమే… అనిల్ కూర్మాచలం
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా పార్టీలో చేరొచ్చని, అలాగే ఈటల రాజేందర్ కూడా ఆయనకు నచ్చిన పార్టీలో చేరొచ్చని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. అక్కడి నాయకుల మెప్పు కోసం రాజకీయ జీవితమిచ్చిన టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను విమర్శించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈటల తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసం ప్రజలను పట్టించుకోని బీజేపీ పార్టీలో చేరడంతో ప్రజలకు ఈటల నిజస్వరూపం అర్థమయిందన్నారు. రాజేందర్‌కు ఢిల్లీలో ఏదైనా గౌరవం దక్కిందంటే అది కేసీఆర్ ఆయనకు ఇచ్చిన రాజకీయ అవకాశాల వల్లే సాధ్యమయ్యిందన్నారు. పదవులన్నీ అనుభవించి ఈ రోజు అదే పార్టీ నాశనం కోరుకోవడం మీ నీతి లేని, మానవత్వం లేని వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ప్రజల మీద సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉన్నదని, దేశమంతా కీర్తిస్తున్న రైతుబంధు పథకాన్ని అక్కడే ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ నుంచి గ్రామ కార్యకర్త వరకు హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.













