శంషాబాద్ వద్ద అమెజాన్ భారీ ఫుల్ ఫిల్మెంట్ సెంటర్
ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్.. దేశంలోనే తమ అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఏర్పాటు చేసింది. శంషాబాద్ వద్ద భారీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను నెలకొల్పగా, దీనితో తెలంగాణలో అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల సంఖ్య ఐదుకు చేరింది. అలాగే అమెజాన్ నిల్వ సామర్థ్యం కూడా 3.3 మిలియన్ ఘనపుటడుగులకు పెరిగింది. ఒక్క శంషాబాద్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ సామర్థ్యమే 2.1 మిలియన్ ఘనపుటడుగులు. కాగా, రాబోయే పండగ సీజన్లో జోరుగా సాగే ఆన్లైన్ అమ్మకాలను దృష్టిలో పెట్టుకునే అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల విస్తరణకు నడుం బిగించింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఉత్పత్తులను త్వరగా వారి వద్దకు చేర్చేందుకు ఇది దోహదపడగలదని అమెజాన్ అంటోంది. ఈ-కామర్స్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే వేగం చాలా ముఖ్యమని అమెజాన్ చెబుతోంది. ఇకపై బుక్ చేసుకున్న ఒకటి, రెండు రోజుల్లోనే కస్టమర్లకు తాము కోరుకున్న ఉత్పత్తులను అందించగలుగుతామన్న విశ్వాసాన్ని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు (ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్) అఖిల్ సక్సేనా వెలిబుచ్చారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్, మొబైల్స్ తదితర గృహోపకరణాలతోపాటు నిత్యావసర సరకుల అమ్మకాలనూ అమెజాన్ జరుపుతున్నది తెలిసిందే.













