తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. అలయ్ బలయ్ : ఉపరాష్ట్రపతి
కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమాజాన్ని ఒకచోటకు చేర్చగలిగే శక్తి సంస్కృతికి ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జలవిహార్లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వాన కమిటి ఆధ్వర్యంలో నిర్వహించిన దత్తన్న అలయ్ బలయ్-దసరా సమ్మేళన్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్ బలయ్ కార్యక్రమని అన్నారు. అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ సంస్కృతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత అని తెలిపారు. భారతదేశానికి ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండటానికి కారణమ మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణేనని అలయ్ బలయ్ కూడా అలాంటి కార్యక్రమమేనని తెలిపారు.
ఈ సందర్భంగా శాస్త్ర, విజ్ఞాన, పరిశోధన రంగాల్లో విశేష కృషి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్రెడ్డి, రెడ్డిలాబ్స్ ఎండీ జీవ ప్రసాద్ రెడ్డి, బయోలాజికల్ ఈవాన్స్ మహీమా దాట్లను ఉపరాష్ట్రపతి సన్మానించారు.













