సచివాలయ నిర్మాణానికి ఏఏఐ అనుమతి
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణానికి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్పోర్టస్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఏఏఐ) అనుమతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడు అంతస్తులు, ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పాత భవనాల కూల్చివేత వ్యవహారంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో నూతన నిర్మాణం విషయంలో ముందస్తుగానే అన్ని అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.400 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయటంతో అధికారిక ఉత్తర్వులూ జారీ అయ్యాయి. గుత్తేదారు ఎంపికకు ఈ వారంలో టెండర్లు పిలవాలని ఆర్అండ్ బీ శాఖ నిర్ణయించింది.













