డాక్టర్ నాగేశ్వర రెడ్డికి మరో అరుదైన పురస్కారం.. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి అరుదైన పురస్కారం దక్కింది. ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఈవో) ప్రతిష్ఠాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారాన్ని (లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు) ప్రకటించింది. ఆయన ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు కావడం గమనార్హం. ఈ మేరకు డబ్ల్యూఈవో మాజీ అధ్యక్షుడు, అవార్డుల కమిటీ ప్రొఫెసర్ జీన్ ఫ్రాంకోయిస్ రే అభినందన లేఖను పంపించారు. పురస్కార కమిటి డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపికచేసినట్లు అందులో పేర్కొన్నారు. ఆయన ఎండోస్కోపీలో చేసిన పరిశోధనలు, ప్రచురణలు, ఆవిష్కరణలు ప్రశంసించారు. 2022 మేలో జపాన్లోని టోక్యోలో జరిగే ప్రపంచ ఎండోస్కోపీ కాంగ్రెస్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.













