ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైన… తొలి భారతీయ వైద్యుడు

హైదరాబాద్‍లోని ఏఐజీ దవాఖాన చైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డీ నాగేశ్వర్‍రెడ్డికి ప్రతిష్ఠాత్మక రుడాల్ఫ్ వీ షిండ్లెర్ అవార్డు లభించింది. ఎండోస్కోపీ రంగంలో చేసిన పరిశోధనలు, బోధనలు, సేవలకుగాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రోస్కోపీ గా పేరొందిన డాక్టర్ రూడాల్ఫ్ వీ షిండ్లెర్ జ్ఞాపకార్థం అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపి (ఏఎస్‍డీఈ) ప్రతి ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది. ఈ అవార్డును దక్కించుకొన్న తొలి భారతీయుడు.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. వర్చువల్ విధానంలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏఎస్‍డీఈ అధ్యక్షుడు డాక్టర్ క్లాస్ మెర్గనర్ మాట్లాడుతూ ఎండో స్కోపి రంగంలో డాక్టర్ నాగేశ్వర్‍రెడ్డి చేసిన సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు.
తనకు ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉన్నదని, తన బాధ్యతను మరింత పెంచిందని నాగేశ్వర్‍రెడ్డి పేర్కొన్నారు. ఎండోస్కోపీలో మరిన్ని పరిశోధనలు, మెరుగైన వైద్యసేవలు, విద్యా బోధన అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంకితభావంతో కృషి చేస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వారికీ గుర్తింపు లభిస్తుందని ఈ అవార్డుతో సృష్టమైందన్నారు. తన సతీమణి, కుటుంబసభ్యులు, ఏఐజీ సహచరులకు నాగేశ్వర్‍రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.