ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే… తదుపరి కార్యాచరణ : మంత్రి ఈటల
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా తీవ్రతపై వైద్యులు ప్రభుత్వానికి ఓ రిపోర్టును సమర్పిస్తారని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ రిపోర్టును ఆధారంగా చేసుకొని భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేస్తామని ఈటల ప్రకటించారు. అసెంబ్లీ లాబీలో మంత్రి ఈటలను కొందరు ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో కరోనా తీవ్రతపై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఈటల వైద్యాధికారులకు ఫోన్లు చేసి, రాష్ట్రంలోని పరిస్థితిపై ఆరా తీశారు. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని, ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. అయితే తీవ్రత మాత్రం అంతగా లేదన్నారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు చికిత్సకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను చేయాలని మంత్రి ఈటల ఆదేశించారు.













