తెలంగాణకు మరో ఐటీ దిగ్గజ సంస్థ
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ అడోబ్ తెలంగాణకు రానుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వినతి మేరకు ఆ సంస్థ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్ హైదరాబాద్‌లో తమ కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు శంతనునారాయణ్ హైదరాబాద్‌కు వచ్చారు. హెచ్ఐసీసీలో ప్రారంభ కార్యక్రమం అనంతరం నారాయణ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. 2015లో అమెరికాలో కలిసినప్పుడు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరినట్లు మంత్రి చెప్పారు. దీనిపై స్పందిస్తూ తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా కొత్త కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నామని నారాయణ్ పేర్కొన్నారు.
గత మూడున్నరేళ్లలో హైదరాబాద్ ఐటీలో గణనీయమైన ప్రగతిని సాధించిందని, తెలంగాణ ప్రభుత్వం నూతన సాంకేతికతలపై ఇక్కడి యువతకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. త్వరలోనే అడోబ్ కేంద్రం ఏర్పాటు, పెట్టుబడి, ఉద్యోగావకాశాలపై పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. మంత్రి కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు.













