తాజ్ సందర్శన కష్టం
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ అందాలను చూసి తరించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ, తాజ్ సందర్శనను మరింత ప్రియం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ప్రధాన సమాధిని దర్శించాలంటే ఎంట్రీ ఫీజుకు రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ వెల్లడించారు. దాంతో పాటు ప్రవేశ రుసుము రూ.40 నుంచి రూ.50కి పెంచినట్టు వివరించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రధాన సమాధి దర్శించాలంటే ఎలాంటి రుసుమూ చెల్లించాల్సి అవసరం లేదు. తాజ్‌మహల్‌ను రాబోయే తరాల వారికి సురక్షితంగా అందించేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్టు శర్మ వివరించారు. ప్రధాన సమాధి ప్రాంగణ పరిరక్షణ, రద్దీని సక్రమంగా నిర్వహించేందుకు రూ.200 రుసుము విధించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.













