పెళ్లిళ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
ఇద్దరు మేజర్లు వివాహం చేసుకోవాలని తీర్మానించుకుంటే అందులో కల్పించుకునే హక్కు ఎవరికీ లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పరువు హత్యలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ మేరకు వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు గానీ, సమాజంగానీ, ఎవరైనా సరే ఇద్దరు వయోజనులు వివాహం చేసుకుంటే అందులో కల్పించుకునే హక్కు ఎవరికీ ఉండదు. వ్యక్తిగతంగా, సమూహంగానీ ఆ పెళ్లిపై జోక్యం చేసుకోజాలరు అని ధర్మాసనం సృష్టం చేసింది.
ఖాప్ పంచాయత్ల పేరిట చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్న వారిపైనా, పరువు హత్యలపైనా నిషేధం విధించాలంటూ శక్తి వాహిని అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మధ్యయుగం నాటి సంప్రదాయాలను కాపాడడం తమ బాధ్యత అన్నట్టు భావిస్తున్న ఖాప్ పంచాయత్ లు కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకునే జంటలను విచారించి శిక్షిస్తున్నాయని తన పిటిషన్లో పేర్కొంది. ఉత్తర భారత దేశంలో ప్రత్యేకించి హర్యానాలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నాయని శక్తి వాహిని నివేదించింది. అయితే అలాంటి పరువు హత్యలకు తాము వ్యతిరేకమని ఖాప్ పంచాయత్ల తరపున వాదిస్తున్న లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే ఖాప్ పంచాయత్లతో తమకు సంబంధం లేదనీ, పెళ్లిచేసుకున్న జంటల హక్కులపైనే అడుగుతున్నామని సుప్రీం కోర్టు సృష్టం చేసింది.













