మా పెళ్లి భారత్-పాక్ లను కలపడానికి కాదు
భారత్, పాకిస్థాన్‌లను కలవడం కోసమే తాము షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నామని చాలా మంది అపోహ పడుతుంటారని కానీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేర్కొంది. సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్‌మాలిక్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. సానియా మీర్జా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తన సోదరి ఆనమ్‌తో టెన్నిస్ అడుతోన్న వీడియోని ఇటీవలే సానియా మీర్జా ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సానియా మీర్జా హిందుస్తాన్ టైమ్స్ పత్రిక కోసం ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి సానియా మీర్జా స్పందించారు.
భారత్, పాకిస్థాన్‌లను కలపడం కోసమే మేం పెళ్లి చేసుకున్నామని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ, అది నిజం కాదు. నా భర్త తరుపు బంధువులను కలవడానికి నేను సంవత్సరానికి ఓ సారి పాకిస్థాన్ వెళ్తాను అని తెలిపింది. అక్కడ నాకు లభించే ప్రేమ, గౌరవం అపారం. ఆ దేశ ప్రజలందరూ నన్ను వదినగా భావిస్తారు. నా భర్తపై ఉన్న అభిమానం వల్ల నాపై ప్రేమను కురిపిస్తారు. షోయబ్ మలిక్ భారత్ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు కూడా అదే స్థాయిలో ప్రేమను చూపిస్తారని సానియా వెల్లడించారు.













