ఎంపీ రంగయ్యకు కీలక బాధ్యతలు
అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా.. రాష్ట్రంలో ఈ నిధుల సద్వినియోగం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ, హౌసింగ్, ఇంజినీరింగ్, పురపాలక శాఖ, తదితర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో పాటు ముగ్గురు ఎంపీలను గౌరవ సభ్యులుగా నియమించారు. అందులో అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు చోటు కల్పించారు. ఈ మేరకు జీఓ 1384ను ప్రభుత్వం విడుదల చేసింది. అత్యున్నత కమిటీలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.













