YS Jagan: జనంలోకి జగన్.. ముహూర్తం ఖరారు..!

తాడేపల్లి, బెంగళూరుకే పరిమితమైన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) సుదీర్ఘ విరామం తర్వాత ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తన పాలనలో మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (Govt Medical Colleges) ప్రైవేటు సంస్థలకు PPP పద్ధతిలో అప్పగించాలని ప్రస్తుత చంద్రబాబు (Chandrababu Govt) ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), ఈ పోరాటానికి నర్సీపట్నం వేదికగా శంఖారావం పూరించబోతోంది. అందులో భాగంగా జగన్ ఈ నెల 9న అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నంలోని (Narsipatnam) ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేశారు. వీటిలో చాలా వరకు నిర్మాణ దశలో ఉన్నాయి. మరికొన్ని అప్పుడే ప్రారంభమయ్యాయి. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో మంజూరైన కొన్ని మెడికల్ కాలేజీల నిర్వహణ భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో, వాటిని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఆరోగ్య రంగంలో ప్రైవేటు సంస్థల జోక్యం పేద, మధ్యతరగతి ప్రజలకు నష్టం కలిగిస్తుందని, ప్రభుత్వ కాలేజీల లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని, పేద విద్యార్థులకు, పేదలకు ఉచిత వైద్య సేవలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌తో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా ఉద్యమ కార్యక్రమాలను చేపడుతోంది. నర్సీపట్నం మెడికల్ కాలేజీ కూడా PPP పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్న కాలేజీల్లో ఒకటి. అందుకే, జగన్ తన తొలి పర్యటనకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ఈ కాలేజీకి సంబంధించిన నిర్మాణ పనులను, ఇతర అంశాలను ఆయన పరిశీలించనున్నారు. ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించనున్నారు.
ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ ఎక్కువగా అంతర్గత సమీక్షలు, సమావేశాలపైనే దృష్టి సారించారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రజల్లోకి వచ్చారు. రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు తీవ్రమైనప్పుడు, జగన్ స్వయంగా గుంటూరు మిర్చి యార్డ్ ను సందర్శించారు. రైతులను కలిసి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ధరల పతనం, పంట నష్టాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మరికొన్ని సందర్భాల్లో జైలుపాలయిన పార్టీ నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. కొన్నిసార్లు జైళ్లకు వెళ్లి ములాఖత్ అయ్యారు. మరికొన్ని సందర్భాల్లో వాళ్లు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇళ్లకు వెళ్లి మద్దతుగా నిలబడ్డారు. అయితే ప్రజా సమస్యలపై జగన్ బయటకు వచ్చి ఉద్యమించింది మాత్రం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకున్నట్టు అర్థమవుతోంది. నర్సీపట్నం పర్యటన ద్వారా మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.
జగన్ ప్రజల్లోకి వస్తుండటం పట్ల వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత, పార్టీకి దిశానిర్దేశం చేసే యంత్రాంగం లోపించింది. ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగడం, ముఖ్యమైన ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవడంతో, పార్టీ కార్యకర్తలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. నర్సీపట్నం పర్యటన తర్వాత, జగన్ మరిన్ని ప్రజా సమస్యలపై దృష్టి సారించి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.