ఏపీ నుంచి రాజ్యసభకు అభ్యర్థుల ఖరారు!
ఆంధప్రదేశ్ నుంచి ర్యాసభకు వైకాపా అభ్యర్థుల పేరు దాదాపు కొలిక్కివచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లాకు చెందిన అయోద్య రామిరెడ్డిల పేర్లు మూడుస్థానాలకు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. నాలుగో స్థానం విషయంలోనే కొంత సందిగ్ధత నెలకొంది. ఈ స్థానాన్ని పార్టీ ముఖ్య నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది.
అయితే ఇటీవల రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అయిన పరిమళ్ నత్వానీని తిరిగి రాజ్యసభకు పంపేందుకు ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు వైకాపా వర్గాల కథనం. నత్యానీకి అవకాశం ఇస్తే రిలయన్స్ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన జగన్ మూడు స్థానాలకు మోపిదేవి, బోస్, రామిరెడ్డిని ఖరారు చేసినట్లు సమాచారం. అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప ఈ ముగ్గురి ఎంపికలో మార్పు ఉండకపోవచ్చంటున్నారు. నాలుగో స్థానం విషయంలో సృష్టత రావాల్సి ఉంది. దీనిపై జగన్ పార్టీ నేతలతో మరోసారి చర్చించనున్నారు.













