ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకుంది చంద్రబాబే.. నేనే సాక్షి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు రాకుండా అడ్డుకుంది టీడీపీ అధినేత చంద్రబాబే అని ఏపీ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న అడ్డుకుంది చంద్రబాబే అనడానికి తానే ప్రత్యక్ష సాక్షినని ఆయన చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరుపెట్టడంపై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు ఆమె సొంత అభిప్రాయమని లక్ష్మీప్రసాద్ తెలిపారు. అప్పట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆదేశాలు వచ్చాయని, అయినా సరే టీడీపీ హయాంలో ఈ ఆదేశాలు ఎందుకు పాటించలేదని అడిగారు. తనకు ఎన్టీఆర్ పై అపారమైన అభిమానం ఉందని, అందుకే యూనివర్సిటీ పేరు మార్చిన రోజే మూడు పదవులకు రాజీనామా చేశానని చెప్పారు. అయితే తెలుగు భాషకు మాత్రం సేవ కొనసాగిస్తూనే ఉంటానని, రాజీనామా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన దృష్టిలో సీఎం జగన్ హీరో అని, ఆయన చేసే పనులు కొందరికి నచ్చక పోవచ్చని చెప్పిన లక్ష్మీప్రసాద్.. ఈ కారణంగా తనను కుల ద్రోహి, తెలుగు ద్రోహి అని తిడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు.













