శ్రీసిటీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
పర్యావరణ హిత ప్రమాణాలతో స్థిరమైన అభివృద్ధి దిశగా పయనిస్తున్న శ్రీసిటీలో సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాణ్ని ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యవేడు అటవీశాఖ రేంజ్ అధికారి జి.జయ ప్రసాదరావు, ఇతర ప్రముఖులు స్థానిక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎమ్సి)లో ప్రత్యేకంగా తలపెట్టిన ఉమ్మడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అడవులు తరహా పచ్చదనాన్ని పెంపొందించే ‘మియావాకి’ పద్దతి ఐదవ దశలో 56 కు పైగా స్థానిక జాతులకు చెందిన దాదాపు 24,000 మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు మియావాకీ పద్ధతిలో దాదాపు 50 వేల మొక్కలు నాటారు. శ్రీసిటీ అంతటా వివిధ ప్రదేశాలలో మొత్తం 23 ఎకరాలను కేటాయించి మియావాకీ అడవుల పెంపకం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతోపాటు కార్యాచరణ రూపొందించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చిందని పేర్కొంటూ, ప్లాస్టిక్ కాలుష్య ప్రభావాన్ని తగ్గించడానికి, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడానికి శ్రీసిటీ ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. శ్రీసిటీ చేపట్టిన హరితహిత చర్యలను అభినందిస్తూ, శ్రీసిటీ పరిశ్రమలు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు దీనికి సహకరించాలని కోరారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఒక సందేశంలో.. ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ (3 ఆర్) విధానం పర్యావరణ పరిరక్షణకు ఎంతో అనువైనదంటూ, శ్రీసిటీలో సుస్థిరత, కాలుష్య నివారణ, వ్యర్థ పదార్థాల నిర్వహణకు పై విధానాన్నే అమలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ హరిత కార్యక్రమాలపై దృష్టి సారించడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘గ్రీన్ & క్లీన్’ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలు, వయస్సుల ప్రజలను మమేకం చేస్తూ కమ్యూనిటీ ఉద్యానవన సాగు ప్రక్రియకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీసిటీ హార్టికల్చర్ & ల్యాండ్‌స్కేపింగ్ విభాగం హెడ్ మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో నోవా ఎయిర్ పరిశ్రమ సీనియర్ ప్లాంట్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్, వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) సి.రమేష్ కుమార్, శ్రీసిటీ పర్యావరణ విభాగం హెడ్ డాక్టర్ వెంకట్, సెక్యూరిటీ & విజిలెన్స్ హెడ్ రమేష్, మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.













