Ap Development: ఏపీకి ఇప్పుడు కావాల్సింది కొత్త ఎయిర్ పోర్టులా లేక మెట్రో నా?
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) అభివృద్ధి కోసం చాలా ప్రాజెక్టులు ప్రణాళికలో ఉన్నాయి. అప్పట్లో హైటెక్ సిటీ స్థాపించి.. సాఫ్ట్వేర్ హబ్ గా హైదరాబాద్ రూపురేఖలు మార్చిన చంద్రబాబు (Chandra Babu) ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధి విషయంలో తీసుకుంటున్న కొన్ని ప్రణాళికల పట్ల ప్రజలలో సందేహాలు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ఏడు ఎయిర్ పోర్టులు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఈ కొత్త ఎయిర్ పోర్టులు అవసరమా? లేక ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలా అనే చర్చ మొదలైంది.
ఏపీలో ఇప్పటికే తిరుపతి పక్కన రేణుగుంట (Renigunta) , గన్నవరం (Ganavaram ) (విజయవాడ), రాజమండ్రి, విశాఖపట్నం, కడప, కర్నూలు వంటి ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని పూర్తి స్థాయిలో వినియోగం లో లేవు. ఉదాహరణకు కర్నూలు ఎయిర్ పోర్టులో కేవలం కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. ఇవి సరైన రద్దీ లేక ఖాళీగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని ఎయిర్ పోర్ట్ నిర్మాణం ప్రభుత్వంపై భారంగా మారుతుందే తప్ప ఆదాయ వనరుగా మారే అవకాశం అయితే లేదు.
ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, ఒంగోలు ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని నిర్ణయించింది. అయితే, వీటి కోసం అవసరమైన భూమి ఇంకా సేకరించాల్సి ఉంది. మరోపక్క ఇదంతా కేవలం రియల్ ఎస్టేట్ దందా .. కొందరి స్థలాల విలువలు పెంచడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఏపీ నగరాలు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మెట్రో రైలు నిర్మాణం ఈ సమస్యలకు మంచి పరిష్కారం అవుతుంది. హైదరాబాద్లో మెట్రో రైలు ఏర్పడ్డ తర్వాత ట్రాఫిక్ సమస్యలు చాలా తగ్గాయి. అలాగే, అమరావతి రాజధాని అభివృద్ధికి, మెట్రో నిర్మాణం వంటి ప్రాజెక్టులు ముఖ్యమని చాలామంది నమ్ముతున్నారు.
ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టులను మెరుగుపరచడం, ఎక్కువ విమానాలు నడిపేలా చూడటం అవసరం. కొత్త ఎయిర్ పోర్టుల కంటే మెట్రో రైలు వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. సరైన ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాఫీగా సాగుతుంది.













