నూతన ఇసుక పాలసీతో ఎంతో మేలు : పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేదీ
నూతనంగా తీసుకొచ్చిన ఇసుక పాలసీ వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. కొత్త పాలసీని ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టెండర్ల సమయంలో ఎవరైనా పాల్గొనేందుకు వీలుగా వారం రోజుల పాటు అదనపు సమయాన్ని కూడా ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. మంత్రివర్గ ఉప సంఘం, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొనే, పాలసీలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని రీచ్‌లలోనూ ఒకే ధర అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి రీచ్‌లోనూ ధరను ముందే నిర్ణయిస్తున్నామని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగదారులు నేరుగా వచ్చి, వారి సొంత వాహనాల్లోనే ఇసుకను తీసుకెళ్లొచ్చని అన్నారు. అంతేకాకుండా ఇసుక నాణ్యతనూ పరీక్షించుకోవచ్చని, నచ్చని పక్షంలో మరో చోట కూడా కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ప్రజలకుందని ఆయన వివరించారు. ఇసుక కొరత సృష్టించడానికి వీలు లేకుండా నిబంధనలను రూపొందించామని, ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక 475 రూపాయల ధరను నిర్ణయించామని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు.













