Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై కలకలం..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గన్నవరం (Gannavaram) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి విజయవాడ (Vijayawada) జైలులో ఉండగానే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జైలు అధికారులు ఆయనను అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డీహైడ్రేషన్, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వంశీ గత మూడు నెలలుగా వివిధ కేసుల్లో జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి నిర్బంధ జీవితం గడుపుతున్నారు. అయితే ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉండటంతో గతంలో కూడా మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో పూర్తి ఆరోగ్య పరీక్షల నిమిత్తం బెయిల్ కూడా మంజూరైన విషయం తెలిసిందే. కానీ ఇటీవల పరిస్థితులు మళ్లీ దారుణంగా మారాయి.
వంశీ రాజకీయ జీవితం వివాదాలతో నిండిపోయింది. ఆయనపై నమోదైన ప్రధాన కేసుల్లో టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి కేసు ముఖ్యమైనది. ఈ దాడికి సంబంధించి దళిత యువకుడు సత్యవర్ధన్ (Satyavardhan) చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావడంతో, దానిని కవర్ చేయడానికి వంశీ కిడ్నాప్ కు పాల్పడ్డారని పోలీసుల అభిప్రాయం. ఈ కేసులో సత్యవర్ధన్ కుటుంబం ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసు విచారణ చేపట్టి, వంశీని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.
అరెస్ట్ అనంతరం వంశీపై మరో కేసు కూడా నమోదైంది, అది గన్నవరం పరిధిలో జరిగిన భూ కబ్జా, నకిలీ పట్టాల పంపిణీ వంటి ఆరోపణలకు సంబంధించింది. ఇలా ఒక్కటొక్కటిగా కేసులు పెరిగిపోవడంతో ఆయనకు బెయిల్ వచ్చినా మరో కేసు రిమాండ్‌లో ఉండటంతో విడుదల కావడం సాధ్యపడలేదు. అరెస్ట్‌కు ముందే ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వంశీ, జైలులో మరింత అస్వస్థతకు లోనయ్యారు. శరీర బరువు తగ్గిపోవడం, మానసిక స్థితి దిగజారడం వంటి లక్షణాలు కనిపించడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చికిత్స తరువాత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందా? లేక మళ్లీ బెయిల్ దరఖాస్తు దిశగా పయనిస్తారా? అన్నది రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.