Mangalagiri AIIMS : మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎగ్జిట్ ర్యాంప్‌కు కేంద్రం ఆమోదం : కేంద్రమంత్రి పెమ్మసాని
ప్రజల వైద్య అవసరాల రీత్యా మంగళగిరి ఎయిమ్స్ (Mangalagiri AIIMS) కి చేరుకోవడానికి మంగళగిరి (ఎన్‌హెచ్-16) వద్ద ఉన్న ఎంట్రీ ర్యాంప్‌ను ఎగ్జిట్ ర్యాంప్ (Exit ramp)గా మార్చేందుకు కేంద్ర రహదారుల శాఖ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) వెల్లడిరచారు. దీని ఫలితంగా ఎయిమ్స్‌కు చేరుకోవాల్సిన దూరం 4.66 కి.మీ నుంచి 1.26కి.మీకు తగ్గుతుందన్నారు. అత్యవసర వైద్యం, రోగుల రవాణా, వైద్య సిబ్బంది రాకపోకలకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్‌హెచ్-16పై మూడు కీలక ప్రదేశాల్లో మొత్తం 13 డైరెక్షన్లో బోర్డులను ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం అనుమతిచ్చిందని పెమ్మసాని తెలిపారు. రోగులు, సందర్శకుల ట్రాఫిక్ నియంత్రణకు ఇది ఎంతో తోడ్పడనున్నట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి చర్యలతో ప్రజలకు ప్రాధాన్యతనిచ్చే కేంద్ర ప్రభుత్వ నిబద్ధత మరోసారి స్పష్టమైందన్న పెమ్మసాని, వేగవంతమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఇది ఒక గొప్ప ముందుడుగని అన్నారు. అనుమతులు మంజూరు చేసిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) కీ కృతజ్ఞతలు తెలిపారు.













