టీటీడీ శుభవార్త …వారికి ప్రత్యేకంగా టికెట్లు
శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల కోసం ఇకపై ప్రత్యేకంగా వీఐపీ (VIP) బ్రేక్ దర్శనాలను కేటాయించాలని నిర్ణయించింది. జూన్ 10వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం రోజూ 1,500 శ్రీవాణి టికెట్లను టీటీడీ కేటాయిస్తోంది. ఇందులో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ (Advance Booking) కింద కేటాయిస్తారు. అలాగే మరో 200 టికెట్లను తిరుపతి ఎయిర్ పోర్టు (Tirupati Airport) లో కరెంట్ బుకింగ్ కోటాలో జారీ చేస్తున్నారు. రోజూ ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ కోటా ద్వారా ఉదయం 9 గంటలకు 800 టికెట్లను జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేసి దర్శన టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారు దాదాపు 40 వేల మందికిపైగా ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీ నూతన సాఫ్ట్ వేర్ (Software) ను అభివృద్ధి చేసింది. ఈక్రమంలో 800 టికెట్ల కోటాలో నుంచి 300 టికెట్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని జూన్ 10వ తేదీ నుంచి ఉదయం 9 గంటలకు విడుదల చేయనునున్నారు. 2027 మార్చి 31 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.







