టీటీడీకి అరుదైన గుర్తింపు… ప్రపంచంలోనే
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒకటి. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల క్షేత్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు నడుస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో మరే ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు గాను టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఇంగ్లండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తిరుమలలో కలిశారు. టీటీడీకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం కల్పిస్తున్నట్లు ఓ ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీనిపై వైఈ సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో మరే క్షేత్రంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నామని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. తమ పనితీరుకు విశిష్ట గుర్తింపు లభించిందని సంతోషం వెలిబుచ్చారు. సాధారణ రోజుల్లో రోజుకు 60 వేల నుంచి 70 వేల మంది భక్తులకు ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం చేయిస్తున్నామని అన్నారు.. శాస్త్రీయ విధానంలో క్యూలైన్ల నిర్వహణ చేపడుతున్నామని అన్నారు. రోజుకు 3.5 లక్షల లడ్డూలను ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.













