టీటీడీ కీలక నిర్ణయం… కాలినడక మార్గంలో
తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. తిరుమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. భక్తులకు మందువైపు, వెనుకవైపు రోప్‌లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు.
అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీటీడీ నుంచి 5 లక్షలు, అటవీ శాఖ నుంచి 5 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రెండు కాలినడక బాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నాం. టీటీడీ చైర్మన్, అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. కాలిబాటలో వచ్చే భక్తులు చిన్న ప్లిలల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













