Kandula Durgesh: పర్యాటకుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్
సమగ్ర పర్యాటక విధానంతో రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్(Kandula Durgesh) వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల దిశానిర్దేశంలో పర్యాటక రంగంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నామన్నారు. సాస్కి -2024-25 (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా అఖండ గోదావరి, గండికోట అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని గుర్తుచేశారు. పర్యాటక రంగంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అమలు చేసి దేశంలోనే ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామన్నారు. తాము ఇచ్చిన చిన్న పిలుపుతో భారీ సంఖ్యలో వచ్చిన పెట్టుబడిదారులకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడలోని హోటల్ వివంతలో సీఐఐ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతుతో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ 2024-29 కాలానికి నూతన పర్యాటక పాలసీని ఆవిష్కరించారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు దాదాపు 200 మందికి పైగా పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్త పర్యాటక పాలసీ విధివిధానాలు, పర్యాటక అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి టూరిజం సెక్రటరీ వి.వినయ్ చంద్, ఎండీ కాట ఆమ్రపాలి కూలంకషంగా వివరించారు.
ఒక్కొక్క ఇన్వెస్టర్‌తో మంత్రి కందుల దుర్గేష్, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం సెక్రటరీ వి.వినయ్ చంద్, ఎండీ ఆమ్రపాలి కాట, ఈడీ పద్మావతి.. ప్రత్యేకంగా మాట్లాడి వారి ప్రతిపాదనలు స్వీకరించారు. రాష్ట్రంలో ఏయే ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి ఉందో అడిగి తెలుసుకొని సాధ్యాసాధ్యాలను వివరించారు. స్పష్టమైన, సహేతుకమైన ప్రతిపాదనలతో రావాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఏ విధమైన సమాచారం కావాలన్నా తనతో సహా ఏపీటీడీసీ చైర్మన్, ఉన్నతాధికారులు అందరూ అందుబాటులో ఉంటారని మంత్రి దుర్గేష్ తెలిపారు.













