మరీ ఇన్ని ఏకగ్రీవాలా? సీఎం అంత పోటుగాడా? : చంద్రబాబు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఈ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈసీ వ్యవహార శైలిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎస్ఈసీ తీరును తప్పుబడుతూ తాము పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. దేశ చరిత్రలో ఇలా జరగడం చాలా అరుదని, పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ బహిష్కరణ కఠిన నిర్ణయమే అయినప్పటికీ, తప్పలేదని అన్నారు. నచ్చిన వారిని ఎన్నుకునే అధికారం ప్రజలకు లేకపోవడం చాలా దారుణమని అన్నారు. ఈ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. ప్రజాకోర్టులో అధికార పార్టీని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఎన్నికలనేవి టీడీపీకి ఏమాత్రం కొత్తకాదని తెలిపారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోవడం లేదని, ఇదేం పద్ధతని మండిపడ్డారు.
సీఎం జగన్ దగ్గర పనిచేశారు కాబట్టి, ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతారా? అని బాబు కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నిని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవమే లేదని మండిపడ్డారు. పోటీ చేసే అభ్యర్థులపై కేసులు పెడతామని బెదిరించారని, నామినేషన్లు వేసినా తిరస్కరించారని మండిపడ్డారు. ‘మరీ ఇన్ని ఏకగ్రీవాలా? ఈ ముఖ్యమంత్రి ఇంత పోటుగాడా?’’ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకే విడతలో పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏంటని సూటిగా ప్రశ్నించారు. సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా హడావుడిగా ఎన్నికలు పెట్టడం అవసరమా? అని నిలదీశారు. నిబంధనలు తోసిరాజని మరీ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని, ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎన్నికల కమిషనర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ గతంలో స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేదని, కొత్త ఎస్ఈసీ వచ్చి రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని చంద్రబాబు ఆక్షేపించారు.













