ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్లను అదనపు జడ్జిలుగా నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. తాజాగా వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది.













