దుర్గమ్మకు తెలంగాణ బోనాలు
భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జులై 14వ తేదీన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు బోనాలు సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను దేవస్థానంలో కలిసి లేఖ అందజేశారు. పదేళ్లుగా భారీ ఊరేగింపుతో వచ్చి పట్టువస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమ, పూలతో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తున్నామని కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ లేఖలో వివరించారు. విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.













