ఏపీలో అడుగు పెట్టబోతున్న రేవంత్ రెడ్డి..!
కంచుకోటలాంటి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తెరమరుగైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రులకు కోపం తగ్గలేదు. అందుకే ఈ పదేళ్లలో ఒక్క చోట కూడా ఆ పార్టీ నెగ్గలేదు. కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. అయితే ఈ ఏడాది ఎన్నికల్లో అయినా కనీస ప్రభావం చూపించాలనే పట్టుదలతో ఉంది. అందుకే షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. ప్రచారానికి పార్టీ కీలక నేతలను మోహరించబోతోంది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. నేతలంతా మళ్లీ యాక్టివ్ అయ్యారు. షర్మిల కూడా ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమం పేరుతో జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నేతలందరినీ కలిసి ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అందుకే ఈసారి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. కొంచెం కష్టపడితే కొన్ని చోట్లయినా నెగ్గే అవకాశం ఉందనే నమ్మకంతో ఉన్నారు షర్మిల. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలను కూడా ఆహ్వానించాలని పీసీసీ నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని షర్మిల స్వయంగా కలిసి ప్రచారానికి రావాలని కోరారు. రేవంత్ రెడ్డి కూడా తప్పకుండా వస్తానని.. పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు సాయం చేస్తానని మాటిచ్చారు. అందులో భాగంగానే ఈ నెల 12న విశాఖలో జరిగే బహిరంగసభకు రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం.
రేవంత్ రెడ్డికి ఏపీలో మంచి క్రేజ్ ఉంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా ముద్రవేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక నేత. రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తనకు జన్మనిచ్చిందని.. ఆ పార్టీపై విమర్శలు చేయబోనని గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఏపీలో అడుగు పెట్టబోతున్న వేళ రేవంత్ రెడ్డి టార్గెట్ వైసీపీయే అని అర్థం చేసుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి ప్రచారం ఏపీ కాంగ్రెస్ కు ఎంతమేర ఉపయోగపడుతుందనేది వేచి చూడాలి.













